వాడ్రేవు చిన వీరభద్రుడు || A poem for Sri Sadasiva ||


హేమంతానికి చెక్కుచెదరని గులాబితోట..
సాదీ షిరాజి (గులిస్తాన్)

ఆయన ఒక గులాబీలబుట్టతో మనమధ్య సంచరించాడు
ఎన్ని సంధ్యలు, ఎన్ని రాత్రులు, ఎన్ని తొలిమంచువేళలు
ఎక్కడెక్కడ ఏ మహామోహన సంగీతమయలోకాల్లో ఏ
పరిమళాలు చవిచూసాడో,ఆ పూలన్నీ ఏరుకొచ్చాడు

ఆ తోటలో ఎన్ని వసంతాలు గడిపాడోగాని, మనకు
తెలిసినప్పటినుంచీ ఒక దర్వేషులాగా ద్వారం దగ్గరే
నిలబడివున్నాడు, దారినపోతున్నవాళ్ళందరినీఎలుగెత్తి
పిలుస్తూనే వున్నాడు,కొమ్మల్లో బుల్బులిపిట్టకు తోడుగా.

పూర్వకాలపు మొఘల్ చక్రవర్తుల ఎదట పారశీక
పూలకంబళి పైన కన్నులరమోడ్చిన రత్నపరీక్షకుడిలాగా
ఆయన మన మధ్యనే కూచుని తీరిగ్గా కొన్ని రదీఫులూ
కొన్ని ఖాఫియాలూ సరిచూస్తూ బతుకంతా గడిపేసాడు.

నిజమైన సాధువు, లోకప్రేమి, తనొక్కడే ఆస్వాదించ
లేదు,రుచిచూసిందెల్లా మనతో పంచుకున్నాడు
తుపానులకు చెదరని,హేమంతాలకు వాడనిఒక
గులాబితోట మనకు వీలునామా రాసివెళ్ళిపోయాడు.
*09-08-2012

అభిప్రాయాన్ని చెప్పండి